R.Santa Sundari

రామవరపు శాంతసుందరి (1947-2020) ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (హిందీ), బి.ఎడ్. చేశారు. ఢిల్లీ, చెన్నై, లిబియా రాజధాని ట్రిపోలిలో హిందీ, ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేశారు. యుజిసి జాతీయ సదస్సులో పాల్గొన్నారు. అనువాదకులకు ఉండాల్సిన లక్షణాలు తండ్రి కొడవటిగంటి కుటుంబరావు నుంచి పుణికిపుచ్చుకుని, అనువాదాన్ని కళగా అభ్యసించి, తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం కలిగి, సృజనాత్మక రచనలకు ధీటుగా అనువాద రచనలు చేపట్టారు.
నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రంగంలో కృషి చేశారు. అందరికీ అర్థమయ్యేలా సరళమైన శైలిలో, కథ, కవిత, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథలు లాంటి అన్ని ప్రక్రియలలో అనువాదాలు చేసి తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా పుస్తకాలు ప్రచురించారు. రెండు తెలుగు సినిమా స్క్రిప్ట్ హిందీ నిర్మాతలకోసం హిందీలోకి అనువదించారు.
మద్రాస్లో పుట్టి పెరగటంవల్ల తమిళం బాగా వచ్చిన ఆమె సుప్రసిద్ధ తమిళ కవి వైరముత్తు తమిళ కవితలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. వీరు చేసిన కొన్ని అనువాదాలు విశ్వవిద్యాలయాల పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నాయి. డి.విజయభాస్కర్ నాటకాలు హిందీలో అనువదించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చేత సత్కరించబడ్డారు. బహుభాషానువాద ప్రజ్ఞకు గుర్తింపుగా ఢిల్లీలోని భారతీయ అనువాద పరిషత్ పురస్కారం, జాతీయ మానవ హక్కుల పురస్కారం పొందారు.
ప్రేమ్ చంద్ బాలసాహిత్యం పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం, 'ఇంట్లో ప్రేమ్ చంద్' అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సాహిత్య సంఘం ఇంటర్ నేషనల్ సాహితీ పురస్కారం, లేఖిని సాహితీ పురస్కారం, అమృతలత అపురూప అవార్డ్. భీంసేన్ నిర్మల్ స్మృతి రాష్ట్రీయపురస్కారం, ఆచార్య కొమ్మా శివశంకర్రెడ్డి స్మృతిపురస్కారం వీరిని వరించాయి.