G.C.Jeevi

జి. చిరంజీవి గారు 1942 డిసెంబర్ 9వ తేదీన నెల్లూరులో జన్మించారు. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా మద్రాసు లోని సదరన్ రైల్వేలో ఉండటం వల్ల, ఆయన హైస్కూల్ విద్యా దశలోనే కుటుంబం మద్రాసులో స్థిరపడింది.
ఆయన తన తొమ్మిదవ తరగతి చదివే సమయంలోనే కథలు రాయడం ప్రారంభించారు. ఆ రాయడం 70వ ఏట వరకు కొనసాగింది. తెలుగులో జి.సి. జీవి గారు 200కిపైగా కథలు అనువాదం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ఫ్రెంచ్, వియత్నామీస్, చైనీస్, స్పానిష్, హంగేరియన్, డెన్మార్క్, అమెరికన్, ఇండో- ఆఫ్ఘన్, పాకిస్తానీ, రష్యన్, చెకోస్లోవేకియన్, ఆఫ్రికన్, స్వీడిష్, లాటిన్, పోలిష్, జపనీస్, సింహళ, టర్కిష్ వంటి భాషల కథలను తెలుగులోకి అనువదించారు. ఉక్రెయిన్ లో ప్రతి నెలా వెలువడే పత్రికలో కొత్త కథలను కూడా తెలుగు లోకి అనువాదం చేసేవారు.
విదేశీ భాషలతో పాటు, తమిళం, ఒడియా, అస్సామీస్, ఉర్దూ, కన్నడ, పంజాబీ, సింధీ, బెంగాలీ, మలయాళం, టిబెటన్, మరాఠీ, అరుణాచల్ ప్రదేశ్ భాషల కథలను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు. ఆ కథలన్నీ ఆనాటి ప్రఖ్యాత తెలుగు పత్రికలైన విపుల, చతుర, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర వార పత్రిక, యువ, స్వాతి, రచన, విజయ, వనిత తదితర అన్ని పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆ కథలలో చాలా వరకు ఆయన సతీమణి జి. మల్లీశ్వరి గారి పేరుతో ప్రచురింపబడటం గమనార్హం.
ప్రముఖ తమిళ రచయిత అశోకమిత్రన్ రచించిన నవలకు జి. సి. జీవి చేసిన తెలుగు అనువాదాన్ని జంట నగరాలు" పేరుతో నేషనల్ బుక్ ట్రస్ట్ 1994 లో ప్రచురించారు.
సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన అశోకమిత్రం కథల సంపుటి ని "నాన్నగారి స్నేహితుడు" పేరుతో అనువాదం చేశారు.
చిరంజీవి గారు 40 సంవత్సరాలబాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెన్నై లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన సాహిత్య సేవలను తెలుగు వారికి అందించారు.