
ఇవి ప్రపంచ దేశాల అనువాద కథలు. 1955లో అద్దేపల్లి అండ్ కో సరస్వతి పవర్ ప్రెస్, రాజమహేంద్రవరం వాళ్లు మొదట ముద్రించారు. భారతదేశం, ఇటలీ, రష్యా, చైనా, జర్మనీ, హంగేరీ వంటి ఎన్నో దేశాలకు చెందిన ప్రసిద్ధ రచయితల అధ్బుతమైన కథలను పురిపండా అప్పలస్వామి గారు తేట తెలుగులో అనువదించారు. ఈ అనువాద కథలను చదువుతుంటే దట్టమైన అడవిలో సన్నగాపారే సెలయేరులో నీరు తాగి దాహం తీర్చుకున్నట్లు వుంటుంది. ఇవి 6 చిన్న పుస్తకాలుగా వచ్చాయి. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో అంటే సుమారు డెబ్బై యేళ్ల తర్వాత ఆ 6 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా బాలా పుస్తక ప్రచురణలు మీ ముందుకు తెచ్చింది.
అనువాద కథల వెనుక కథ – అనిల్ బత్తుల
అది 2010. నాకు చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ గీసిన నైరూప్య చిత్రాలు ఇష్టం. వాటిని మొదట, కవి వేగుంట మోహనప్రసాద్ కవిత్వ పుస్తకాలకు ముఖచిత్రాలుగా చూశాను. తరువాత కేశవరెడ్డి నవలలకు కాళ్ళ గీసిన రూప చిత్రాలను ముఖ చిత్రాలుగా చూశాను. రిటైర్డ్ లైబ్రేరియన్ గంగాధరరావుతో ఈ విషయం చెప్పి, ” కాళ్ళని కలవాలని వుందండి” అన్నాను. కేవలం కాళ్ళని కలవడానికి, అతడి చిత్రాల ఒరిజినల్స్ చూడటానికి ఇద్దరం కలిసి ఖమ్మం వెళ్లాం. ఆ మిట్టమధ్యాహ్నం ఆకాశంలో రంగుల ఇంద్రధనస్సు మెరిసింది. కాళ్ళ పర్సనల్ లైబరీలో ఈ ‘విశ్వకథావీధి ‘ ఆరు పుస్తకాల సెట్ మొదటిసారి చూశాను. “చదివి ఇస్తానండి”..అన్నాను. “నీకు గిఫ్ట్ నాన్నా, తీసుకో”..అన్నాడు ప్రేమగా భుజం తడుతూ. తరువాత వీటిని జరాక్స్ తీయించి, డిజిటలైజ్ చేశాను. ఆ పనిలో ఆదిత్య కొర్రపాటి సహకరించాడు. ఈ ఆరు చిన్న పుస్తకాలను పురిపండా అప్పలస్వామి అద్భుతంగా అనువదించారు. 1955లో వీటిని మొదట అద్దేపల్లి అండ్ కో వారు సరస్వతి పవర్ ప్రెస్, రాజమహేంద్రవరంలో ముద్రించారు. ఇప్పుడు 2025 లో అంటే డెబ్బై యేళ్ల తర్వాత ఈ అపురూపమైన ప్రపంచ అనువాద కథల ఆరు చిన్న పుస్తకాల్ని కలిపి ఒకే పుస్తకంగా ముద్రిస్తున్న ‘ బాల పుస్తక ప్రచురణలు ‘ ఉషా ప్రత్యూషకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విలువైన పుస్తకాన్ని ఈకాలం పాఠకులు కూడా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను.