
జి. చిరంజీవి ( G Chiranjeevi) గారు 1942 డిసెంబర్ 9న నెల్లూరులో జన్మించారు. ఆయన తండ్రి మద్రాస్ (ప్రస్తుతం చెన్నై) లోని సదరన్ రైల్వేలో ఉద్యోగం చేసిన కారణంగా, వారి కుటుంబం మద్రాసుకు మారింది. తన హైస్కూల్ చదివే రోజుల నుండే ఆయన తెలుగు భాషలో అద్భుతమైన ప్రతిభను చూపించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి (ప్రస్తుతం 10వ తరగతి) పరీక్షలో తమిళనాడులో తెలుగు భాషలో మొదటి ర్యాంకు సాధించారు. ఆయన పేరు ఇప్పటికీ పెరంబూర్ లోని DRBCCC హైస్కూల్ రికార్డుల్లో ఉంది.
తెలుగు భాషపై ఉన్న ఈ ఆసక్తి వల్లే ఆయన ఒక కథా రచయితగా, అనువాదకుడిగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, ఇంటర్వ్యూవర్‌గా, నవలా రచయితగా మారారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పటినుండి ఆయన తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు, ఇది వారి 70వ ఏట వరకూ కొనసాగింది. ఆయన 200కి పైగా తెలుగు చిన్నకథలు రచించారు. వీటిలో చాలా కథలు విపుల, చతుర, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, ఆంధ్ర వార పత్రిక, యువ, స్వాతి, రచన, విజయ, వనిత వంటి ప్రముఖ తెలుగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. బాల మిత్ర, బాల జ్యోతి, చందమామ వంటి బాలల పత్రికల్లో కూడా ఆయన కథలు వచ్చాయి.
ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించడంలో చిరంజీవిగారు ప్రముఖ పాత్ర వహించారు. ఫ్రెంచ్, ఇటాలియన్, వియత్నామీస్, చైనీస్, స్పానిష్, హంగేరియన్, డెన్మార్క్, సింహళ, జర్మన్, న్యూజిలాండ్, స్వీడిష్, లాటిన్, అమెరికన్, పాకిస్తాన్, ఆఫ్రికన్, పోలిష్, జపనీస్, చెకొస్లోవేకియన్, మాల్దీవియన్ భాషల నుండి అనేక కథలను తెలుగులోకి అనువదించి, ఇవన్నీ ఈనాడు గ్రూప్ లోని విపుల మాసపత్రికలో జి. సి. జీవి, జి. చిరంజీవి, జి. మల్లీశ్వరి (ఆయన భార్యామణి) పేరిట ప్రచురించారు.
విదేశీ భాషలతోపాటు, ఆయన తమిళ్, ఒరియా, అస్సామీ, ఉర్దూ, కన్నడ, పంజాబీ, సింధీ, బెంగాలీ, మలయాళం, టిబెటియన్, మరాఠీ, అరుణాచల్ ప్రదేశ్ వంటి భారతీయ భాషల కథలను కూడా తెలుగులోకి అనువదించారు, ఇవన్నీ విపులలో ప్రచురితమయ్యాయి.
తమిళ సాహిత్య రంగంలోనూ ఆయన విశేష కృషి చేశారు. జయకాంతన్, కందస్వామి, ప్రపంజన్, మురుగనంద, జయరత్నన్, ఈ.ఆర్. మురుగన్, కె. సత్తనాథన్, సుజాత, చూడామణి, శివశంకరి, అశోకమిత్రన్ వంటి ప్రసిద్ధ తమిళ రచయితల కథలను తెలుగులోకి అనువదించారు.
తమిళ నుండి తెలుగులోకి అనువదించిన ముఖ్యమైన రచనలు:
1. అశోకమిత్రన్ యొక్క నవల – జంటా నగరాలు పేరుతో 1994లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రచురించబడింది.
2. అశోకమిత్రన్‌కు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కథా సంపుటి “అప్పావిన్ స్నేహిధర్” – తెలుగులో నాన్నగారి స్నేహితుడుగా అనువదించారు.
3. తమిళ రచయిత సుజాత యొక్క “స్వర్గ నరకం” నవల – తెలుగులో స్వర్గం నరకం పేరుతో చతుర మాసపత్రికలో ప్రచురించబడింది.
4. వీ. వీరభద్రన్ రచించిన బి. నాగిరెడ్డి (విజయ స్టూడియో వ్యవస్థాపకుడు) జీవితం పై పుస్తకం – జ్ఞాపకాల పందిరిగా అనువదించారు.
5. స్వామి సుఖబోధానంద యొక్క “మనసా రిలాక్స్ ప్లీజ్” పుస్తకం – అదే శీర్షికతో తెలుగులోకి అనువదించారు.
చిన్న కథలతో పాటు, ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు, ఇవి ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఉదయం, వార్త వంటి ప్రముఖ తెలుగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అలాగే ఆయన అనేక గొప్ప వ్యక్తులతో ఇంటర్వ్యూలు కూడా చేశారు, అందులో కొన్ని:
• వెంపటి చిన్ని సత్యం – కూచిపూడి నాట్యకళాకారుడు
• భానుమతి – ప్రసిద్ధ నటి
• గద్దర్ – విప్లవ కవి
• ఎస్. రాజేశ్వరరావు – ప్రఖ్యాత సంగీత దర్శకుడు
• బాలమురళీకృష్ణ – ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు
ఈ ఇంటర్వ్యూలు ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికల్లో విస్తృతంగా ప్రచురించబడ్డాయి.
ఇటీవల జి. చిరంజీవి గారి కుటుంబ సభ్యుల నుండి ఆయన సమగ్ర సాహిత్యాన్ని బాలా పుస్తక ప్రచురణల ద్వారా ప్రచురణ కు అనుమతినిస్తూ సందేశాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో నమ్మకంతో ఈ మహత్తర బాధ్యత ను మాపై ఉంచడాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాము. ముఖ్యంగా ఇంతటి విలువైన సమాచారం మాతో పంచుకున్న ఆయన కుమార్తె జి. సాయి కుమారి గారికి మా హృదయపూర్వక నమస్కారం. గత రెండు నెలలుగా మేమిద్దరం చిరంజీవి గారి జ్ఞాపకాలను, అనుభవాలను గూర్చి పలుసార్లు గంటల తరబడి మాట్లాడుకున్నాము.
రాబోయే రోజుల్లో బాలా బుక్స్ పబ్లికేషన్స్ వారి సాహిత్యాన్ని – కథలు, అనువాదాలు, వ్యాసాలు, నవలలు – అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రచురించనుంది. ఇప్పటికే ప్రపంచ సాహిత్య అనువాద కథల సంకలనం ఒకటి సిద్ధమయ్యింది. ఈ పుస్తకం కవర్ పేజీని మా ప్రియమైన తెలుగు పాఠకులతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
