పెళ్లి మానవ జీవితంలో ఒక ప్రధాన ఘట్టం. పెళ్లిలో వ్యక్తి జీవితం మరో మలుపు తిరిగి, మానవ సంబంధాలు విస్తృతపరచబడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లితో సొంతమైన వ్యక్తితోనే జీవితాంతం సహజీవనం, సంసారం కొనసాగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పెళ్లిపైన తెలుగులో తగినన్ని కథలు రాలేదు. అందునా ప్రత్యేకంగా ఆ పేరుతో కథల సంపుటాలు లేదా సంకలనాలు అసలే లేవు. ఆ లోటును తీరుస్తున్నది ఆచార్య జయదేవ్ గారు రాసిన ఈ ‘పెళ్లి కథలు’.
పెళ్లి ఒక పవిత్రమైనది. ఒక నిబద్ధత కలిగినది. భవిష్య జీవితాన్ని నిర్దేశించేది. ఎక్కడో పుట్టి పెరిగిన ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఒకటిగా కూర్చి, తోడు నీడను కల్పించేది. మధ్యతరగతి మనుషులకు ఇది మరీ ముఖ్యమైనది. అందుకే ఒక పద్ధతి ప్రకారం పెళ్లిళ్లు జరుగుతాయి. వధూవరుల అన్వేషణతో ఆరంభమై, పెళ్లిచూపులతో కుదర్చబడుతుంది. ఆ తర్వాత కట్న కానుకలు, వస్త్ర, శాస్త్ర పద్ధతులు, పెళ్లి మండపాలు, బంధుమిత్ర గణాలకాహ్వానభోజనాధుల వసతులు, ఆ తర్వాత అందరి సమక్షంలో ఆహుతుల ఆశీర్వచనాలతో, అక్షింతలతో వరుడి మాంగల్య ధారణ, అదయిన తర్వాత వధువు అప్పగింతలు, శోభన వేడుకలు షరా మామూలే. ఇవన్నీ ఒకప్పుడు బాగా జరపబడే పద్ధతులు. కానీ కాలం మారింది. కాలానికనుగుణంగా పద్ధతులు మారాయి. ఒకప్పుడు నాలుగైదు రోజులుగా జరిగే పెళ్లి వేడుకలు నేడు ఒక రోజుకే కుదిరించబడ్డాయి. ఇంకా చెప్పాలంటే పెళ్లి కొన్ని గంటలకే పరిమితం చేయబడ్డది. ఇలాంటి తరుణంలో ఈ పెళ్లికీ, మానవ సంబంధాలకు మధ్య ఉన్న బలమైన లంకె రాను రాను ఎలా బలహీన పడిపోతోందో, ఈనాటి కనుగుణంగా మారిన పెళ్లిళ్లు, పెళ్లి సంబంధాలు, అవి జరిగే విధానాలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ ఈ పెళ్లి కథల్లో చక్కగా చెప్పబడ్డాయి.